schedule Thursday, September 03, 2026

ప్రకృతి రాఖీ.. ప్రత్యేకం..!

calendar_today August 26, 2026
person dharshininews
ప్రకృతి రాఖీ.. ప్రత్యేకం..!
ప్రకృతి రాఖీ.. ప్రత్యేకం..! - గోమయ రాఖీలకు తాండూరులో ఆదరణ - రాఖీలకు మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య ప్రోత్సాహం తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగకు ఇప్పుడు పర్యావరణ హితం తోడవుతోంది. రసాయనాలు, ప్లాస్టిక్‌తో తయారయ్యే రాఖీలకు భిన్నంగా సహజసిద్ధంగా తయారు చేసిన గోమయ రాఖీలు తాండూరులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తాండూరు మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య గోమయ రాఖీలను ప్రోత్సహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా రాఖీతో పాటు వివిధ పండగల సందర్భంగా సహజసిద్ధమైన ఉత్పత్తుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా పరిగి ప్రాంతానికి చెందిన శివరామకృష్ణాచారి దీర్ఘాయిష్షు సంస్థ ద్వారా గోమయంతో రాఖీలు, బ్యాడ్జీలు, దీపాలు తదితరాలను తయారు చేస్తున్నారు. వీటిని కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య ప్రోత్సహిస్తూ ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఈసారి కూడా గోమయ రాఖీలను అందుబాటులోకి తీసుకురావడంతో పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఈ గోమయ రాఖీలను విడిచిన తరువాత మట్టిలో పూడిస్తే అందులో నుంచి విత్తనం మొలకెత్తుతుంది. పండుగతో పాటు మొక్కలు పెంచడం ప్రకృతికి బహమతి ఇచ్చే విధంగా వీటిని తయారు చేయడం విశిష్టత. గోమయ రాఖీలను వినయోగించండి : కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య రాఖీ పండగను ప్రకృతి సిద్ధంగా జరుపుకోవడంలో భాగంగా గోమయ రాఖీలను వినియోగించడం వల్ల సంప్రదాయంతో పాటు ప్రకృతికి మంచి చేసిన భావన కలుగుతుంది. పర్యావరణానికి మేలు చేసే గోమయ రాఖీలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. ఇలాంటి సహజసిద్ధమైన వస్తువుల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. https://www.dharshininews.com/44376/