schedule Thursday, September 03, 2026

నకీలీ వేలి ముద్రలతో బ్యాంకు ఖాతా ఖాళీ..!

calendar_today December 28, 2022
person dharshininews
నకీలీ వేలి ముద్రలతో బ్యాంకు ఖాతా ఖాళీ..!
నకీలీ వేలి ముద్రలతో బ్యాంకు ఖాతా ఖాళీ..! - ఆధార్‌ బ్యాంకు సేవల లూపుతో లూటీ - నిందితుడిని అరెస్టు చేసిన సీఐడీ అధికారులు హైదరాబాద్, దర్శని ప్రతినిధి : బ్యాంకు ఖాతాదారుల నకిలీ వేలి ముద్రలతో వారి డబ్బులను ఖాళీ చేశాడు ఈ ఘరానా కేటుగాడు. బ్యాంకులలో ఖాతాదారులకు అందిస్తున్న ఆధార్ బ్యాంకు సేవలలో ఉన్న లూపును అనువుగా చేసుకుని అకౌంట్‌లను లూటీ కేసీ నిందితున్ని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఖాతాదారుల సౌలభ్యం కోసం చాలా బ్యాంకులు ‘ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ’ (ఏఈపీఎస్‌) పేరుతో ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. ఈ సేవలు పొందాలనుకునేవారు ముందుగానే బ్యాంకు ఖాతా, ఆధార్‌ నంబరు, వేలిముద్రలను బ్యాంకుకు సమర్పించాలి. ఆ తర్వాత వారు లావాదేవీలు నిర్వహించాలనుకుంటే ఒక్కసారి వేలిముద్ర ఇస్తే చాలు... ఆన్‌లైన్‌ ద్వారా నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్‌, నగదు బదిలీ వంటి లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఖాతాదారులకు మరింత సులభతరమైన సేవలు అందించే ఉద్దేశంతోనే దీన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే బిహార్‌కు చెందిన అక్మల్‌ అలమ్‌ ఆధార్‌ ద్వారా బ్యాంకు సేవలను ఉపయోగించుకొని నేరాలకు పాల్పడ్డాడు. ముందుగా రిజిస్ట్రేషన్లశాఖలోని ధ్రువపత్రాలు, వాటి నుంచి వేలిముద్రలు సేకరించాడు. వాటి ఆధారంగా సిలికాన్‌ పదార్థం ఉపయోగించి నకిలీ వేలిముద్రలు తయారుచేశాడు. ఏఈపీఎస్‌ సేవలు పొందుతున్న ఖాతాదారుల వివరాలు కూడా సేకరించాడు. ఇప్పుడు చాలా బ్యాంకుల ఏటీఎంలు కేవలం వేలిముద్ర ద్వారానే నగదు ఉపసంహరణ సదుపాయాలు కల్పించాయి. పిన్‌ నంబర్‌ ఇవ్వాల్సిన పనిలేదు. అక్మల్‌ చోరీ చేసిన వేలిముద్రలను ఉపయోగించుకొని ఇటువంటి ఏటీఎంల ద్వారా పెద్దమొత్తంలో నగదు ఉపసంహరించుకున్నాడు. అదేవిధంగా కిషన్‌గంజ్‌ జిల్లా కొచ్చడమాన్‌కు చెందిన అక్మల్‌ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన స్టేట్‌బ్యాంక్‌లో ఉన్న ఖాతాని ఏమార్చి పెద్దమొత్తంలో నగదు కొట్టేశాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు ఈనెల 22న బిహార్‌లోనే అక్మల్‌ను అరెస్టు చేసి అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ట్రాన్సిట్‌ వారెంట్‌పై మంగళవారం హైదరాబాద్‌ తీసుకొచ్చి స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం జైలుకు తరలించారు.