schedule Thursday, September 03, 2026

తెలంగాణ‌కు తుఫాను గండం

calendar_today September 25, 2021
person dharshininews
తెలంగాణ‌కు తుఫాను గండం
తెలంగాణ‌కు తుఫాను గండం - రానున్న మూడు రోజులు  భారీ వ‌ర్షాలు - అల‌ర్ట్ ప్ర‌క‌టించిన వాతావ‌ర‌ణ శాఖ హైద‌రాబాద్‌, ద‌ర్శ‌ని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రానికి తుఫాను గండం పొంచి ఉంద‌ని హైద‌రాబాద్ వాతార‌వ‌ర‌ణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. దీని కార‌ణంగా రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. మ‌రో 6 గంటల్లో వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని, ఈ తుఫాను ఉత్తర ఆంధ్రా- దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతాల్లో విశాఖపట్నం, గోపాల్ పూర్, కళింగ పట్నం దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తోందని తెలిపింది. 27న ఈశాన్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచ‌నా వేసింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిచ‌క‌రిలు జారీ చేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అవసరమైతే తప్ప జనం ఎవరూ బయటకు వద్దని అధికారులు సూచిస్తున్నారు.