ముందే రుతుపవనాలు..!
May 13, 2022
dharshininews
ముందే రుతుపవనాలు..!
- వచ్చే నెల మొదట్లోనే వర్షాలు
- సెప్టెంబర్ వరకు సీజన్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: భారత వాతావరణ విభాగం రైతులకు శుభవార్త చెప్పింది ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) ముందుగానే వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఈసారి నైరుతి రుతుప వనాలు ఈ నెల 15వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే ఒక వారం ముందుగానే కేరళను తాకే అవకాశం ఉన్నదని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయి. అయితే దీంతో అండమాన్ నికోబార్ దీవుల్లో తొలి వర్షాలు కురవచ్చని అధికారులు వెల్లడించారు. ఈనేపథ్యంలో రుతుపవనాలు ఈసారి కేరళకు ముందుగానే వచ్చే అవకాశం ఉదని చెప్పారు. జూన్ 5 నుంచి 8 మధ్య తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించవచ్చని తెలిపారు. కాగా, ఈ ఏడాది దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురు స్తాయని అంచనా వేస్తున్నారు. ఈ సారి సెప్టెంబర్ మాసం వరకు రుతుపవనాల సీజన్ కొనసాగవచ్చని భావిస్తున్నారు.