schedule Friday, July 10, 2026

రైతు వేదికలకు లక్ష్మీ కటాక్షం

calendar_today December 9, 2022
person dharshininews
రైతు వేదికలకు లక్ష్మీ కటాక్షం
రైతు వేదికలకు లక్ష్మీ కటాక్షం - నిర్వహణకు సర్కారు నిధుల విడుదల - నెల వారిగా ఖర్చుల జాబితా దర్శిని ప్రతినిధి: నిర్వహణకు నిధులు లేక బోసి బోతున్న రైతు వేదికలపై సర్కారు కరుణ చూపించి.. లక్షీ కటాక్షాన్ని అందించింది. రైతులకు అధికారులు అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో రైతు వేదికలను నిర్మించింది. నిర్మాణ సమయంలోనే రైతు వేదికల నిర్వహణకు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించింది. కాని అది అమలుకు నోచుకోలేదు. దీంతో రైతు వేదికలలో సౌకర్యాలు లేక, నిర్వహణ భారమై వెలవెల బోతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్వహణకు నిధులు మంజూరు చేసేందుకు పచ్చజెండా ఊపింది. నిధుల వినియోగం ఇలా.. రైతు వేదికల నిర్వహణకు మంజూరయ్యే నిధులను ఏ విధంగా వాడుకోవాలో ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక రైతు వేదికకు నెలకు మంజూరయ్యే రూ.9వేలలో విద్యుత్‌ బిల్లులకు రూ.వెయ్యి, తాగునీటికి రూ.500, స్వీపర్‌కు రూ.3వేలు, స్టేషనరీ, జిరాక్స్‌ తదితరాలకు రూ.వెయ్యి, రెండు శిక్షణలకు రూ.2500, చిన్న చిన్న రిపేర్లు, శానిటరీ, ఫర్నిచర్‌, వ్యవసాయ సంబంధ పత్రికల కొనుగోలు తదితర ఖర్చులకు రూ.1వెయ్యి వినియోగించుకోవాలి. జిల్లాకు 44.55 లక్షలు విడుదల ప్రభుత్వ హామీ మేరకు నెలకు రూ.9 వేల చొప్పున ఐదు నెలలకుగాను రూ.45 వేలను జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయానికి జమ చేసింది. ఈ నిధులను క్లస్టర్‌వారీగా విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రైతు వేదికల పేరిట బ్యాంకులో పొదుపు ఖాతాలను ప్రారంభించి.. వాటిలో జమ చేయడానికి అధికారులు ఏఈవోలకు సమాచారం ఇచ్చారు. నిధుల విడుదలతో రైతు వేదికల నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుందని భావిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో 99 క్లస్టర్లు, 99 రైతు వేదికలు ఉండగా.. ఒక్కో దానికి రూ.45 వేల చొప్పున ఐదు నెలలకుగాను రూ.44.55 లక్షల నిధులు విడుదలయ్యాయి. నిధులను రైతు వేదిక ఖాతాల్లో జమ చేస్తాం – గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి ఇంతవరకు రైతు వేదికి నిర్వహణ ఇబ్బందిగా ఉండేది. నిధులు రావడంతో స్వీపర్‌ను నియమించుకోవడం, కరెంటు బిల్లులు, వాటర్‌ బిల్లులు చెల్లించుకోవచ్చు. ఏఈవోలు క్షేత్ర సందర్శనకు వెళితే రైతు వేదికను మూయకుండా స్వీపర్‌ తెరిచి ఉంచుతారు. వచ్చిన నిధులను రైతు వేదిక ఖాతాల్లో జమ చేస్తాం.