schedule Saturday, September 05, 2026

జీరో టిక్కెట్.. ఫ్రీ ట్రావెల్..!

calendar_today December 8, 2023
person dharshininews
జీరో టిక్కెట్.. ఫ్రీ ట్రావెల్..!
జీరో టిక్కెట్.. ఫ్రీ ట్రావెల్..! - మహాలక్ష్మీ మార్గదర్శకాలు జారీ - రేపటి నుంచి ఉచిత ప్రయాణాలు షురూ - ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉచితం అంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలలో ఒకటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంకు సంబంధించి మహాలక్ష్మీ పథకం అమలుకు కార్యాచరణ పూర్తయ్యింది. జీవో నంబర్ 47 ద్వారా మహాలక్ష్మి పథకం విధివిధానాలను ప్రభుత్వం వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థలో చరిత్రాత్మక నిర్ణయం ఇది. ఈ పథకం ద్వారా ప్రజా రవాణాకు మేలు జరుగుతుంది. జీరో టిక్కెట్ విధానంలో ఫ్రీ ట్రావెల్‌ ను అనుమతించడం జరుగుతుందని ఇందులో స్పష్టం చేశారు. రేపు శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకం ప్రారంభించడం జరగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వయసుల బాలికలు, మహిళలు, లింగమార్పిడి వ్యక్తుల కోసం మహాలక్ష్మి పథకం రేపటి నుంచి ప్రారంభం కానుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఏదో ఒక స్థానికత ధ్రువీకరణ గుర్తింపు కార్డు చూపించి తెలంగాణ రాష్ట్రంలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలు రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్‌ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 5.. 6 రోజుల తర్వాత ఎలక్ట్రానిక్‌ మిషన్‌ ద్వారా జీరో టికెట్‌ ప్రింటింగ్‌ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం 7,200 సర్వీసులను మహాలక్ష్మి పథకం కోసం ఉపయోగిస్తామని, కొన్ని రోజులు గడిచిన తర్వాత దీనిపై సమీక్షించి.. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామని ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల మహిళలకు రక్షణ ఉంటుందని అన్నారు. మహిళా ప్రయాణికులు ప్రయాణించే వాస్తవ దూరం ఆధారంగా వసూలు చేసే ఛార్జీల కోసం తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీకి ఖర్చును రీయింబర్స్ చేస్తుంది. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22489/