schedule Saturday, July 04, 2026

అధికార పార్టీలో ఏకపక్ష పాలన..!

calendar_today April 10, 2026
person dharshininews
అధికార పార్టీలో ఏకపక్ష పాలన..!
అధికార పార్టీలో ఏకపక్ష పాలన..! - ప్రోటోకాల్ పాటించకుండా పథకాలు - ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల పట్ల వివక్ష - రంజాన్ తోఫా, డబుల్‌ బెడ్‌రూంలలో అక్రమాలపై ఫిర్యాదు - న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి - జిల్లా కలెక్టర్‌కు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్‌లో అధికార పార్టీ ఏకపక్షంగా పాలన చేస్తోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు విమర్శించారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్, ఫ్లోర్ లీడర్‌ దీపా నర్సింలు పేరుతో ఆ పార్టీ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. తాండూరు మున్సిపల్‌లో ఏకపక్షంగా వ్యవహరించిన పలు పరిణామాలను వినతిపత్రంలో వివరించారు. రంజాన్ పండగ సమయంలో ప్రభుత్వం పంపిణీ చేసిన తోఫాను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లతో కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన అభ్యర్థులతో పంపిణీ చేయించారని తెలిపారు. తాజాగా పేదలకు పంపిణీ చేయాల్సిన డబుల్ బెడ్‌ రూంల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన అభ్యర్థుల నుంచి విచారణ చేయించి.. వారు సూచించిన వారికే ఇళ్లను కేటాయించేలా యత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజల నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ల పట్ల ప్రజా పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా స్వామ్య విరుద్ద పాలనకు పాల్పడుతుందని మండిపడ్డారు. మున్సిపల్‌లో ఏ కార్యక్రమం చేపట్టిన ప్రోటోకాల్ పాటించడం లేదని అధికారుల దృష్టికి తెచ్చారు. రంజాన్ తోఫా విషయంలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా డబుల్‌ బెడ్‌ రూం విషయంలో పారదర్శకత పాటించేలా చూడాలని డిమాండ్ చేశారు. మున్సిపల్‌లో జరిగే కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ పాటించేలా చూసి బీఆర్ఎస్ కౌన్సిలర్లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ చేపట్టిన పథకాలలో అక్రమాలపై తగిన ఆధారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈర్షాద్, జావిద్, సురేష్‌ నాయక్, యోగానంద్, పార్టీ నాయకులు రుద్రుపాటిల్, సంతోష్ గౌడ్, ఎజాజ్, అనంత్ రెడ్డి, సంతోష్‌ తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/43001/