schedule Wednesday, September 09, 2026

రోడ్లపై గుంతలకు చెక్..!

calendar_today September 9, 2026
person dharshininews
రోడ్లపై గుంతలకు చెక్..!
రోడ్లపై గుంతలకు చెక్..! - ప్యాచ్ వర్క్ లతో మరమ్మత్తులు - తాండూరు మున్సిపల్ కసరత్తు - 36 వార్డులకు ప్యాకేజీ చొప్పున నిధులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రధాన, అంతర్గత రహదారులపై ఏర్పడిన గుంతలకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన అనంతరం సీసీ ప్యాచ్‌వర్క్, గుంతల పూడ్చివేత పనులకు రూ.10 లక్షలు కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం.. పట్టణంలోని 1 నుంచి 18 వార్డుల పరిధిలో రూ.5 లక్షలు, 19 నుంచి 36 వార్డుల పరిధిలో మరో రూ.5 లక్షల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. మున్సిపల్ జనరల్ ఫండ్స్‌ నుంచి ఈ నిధులను వినియోగించనున్నట్లు ప్రతిపాదనలో పేర్కొన్నారు. గుంతలతో ప్రజలకు ఇబ్బందులు పట్టణంలోని పలు ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు గుర్తించారు. వర్షాలు, వాహనాల రాకపోకలతో రోడ్లు మరింత దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటో, ఇతర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని తక్షణ మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గుంతలు ఏర్పడిన చోట సీసీ ప్యాచ్‌లు వేయడం వల్ల తాత్కాలికంగా సమస్య తగ్గినా, రోడ్ల నాణ్యత, డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి పారుదల వంటి అంశాలను సమగ్రంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. రూ.10 లక్షలతో చేపట్టనున్న పనులు నాణ్యతా ప్రమాణాలతో, అవసరమైన ప్రాంతాలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి పూర్తి చేస్తే ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా పట్టణంలోని దెబ్బతిన్న రహదారులకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. https://www.dharshininews.com/44616/