schedule Friday, July 10, 2026

పీఎస్ఆర్ వ‌ర్సెస్ టీకేఆర్

calendar_today July 5, 2022
person dharshininews
పీఎస్ఆర్ వ‌ర్సెస్ టీకేఆర్
పీఎస్ఆర్ వ‌ర్సెస్ టీకేఆర్ - మంత్రి స‌బితారెడ్డిపై ఆరోప‌ణ‌లు చేసిన తీగ‌ల‌ - తీగ‌ల‌తోనే చ‌ర్చించుకుంటానన్న మంత్రి స‌బితా హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాలోని గులాబీ పార్టీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప‌ట్లోళ్ల స‌బితారెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డంతో చ‌ర్చ‌నీయాంశ‌ రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. అస‌లేం జ‌రిగిందంటే మంగ‌ళ‌వారం మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి విద్యాశాఖ మంత్రిపై ఆరోప‌ణ‌లు చేశారు. సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని.. చెరువులు, పాఠశాలల స్థలాలను వదలడం లేదని ఆరోపించారు. మీర్‌పేటను నాశనం చేస్తున్నారని. మీర్ పేట నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని అన్నారు. తమ పార్టీ నుంచి మంత్రి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదని, అభివృద్ధిని గాలికొదిలేశారని చెప్పారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తిచేయలేదన్నారు. మంత్రి సబిత వైఖరిపై సీఎంతో మాట్లాడతానని అన్నారు. స్పందించిన మంత్రి స‌బితారెడ్డి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఆమె మాట్లాడుతూ..తనపై భూకబ్జాలు, ఇతర కబ్జాలు చేసినట్లు ఆరోపణలు వస్తే వాటిపై ముఖ్యమంత్రి విచారించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. తనపై విచారణ జరుపుకోవచ్చని అన్నారు. కబ్జాలు చేసి ఉంటే ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పారు. కృష్ణారెడ్డి అలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదని, ఎవరో మిస్ గైడ్ చేశారో తనకు తెలియదన్నారు. తాను ఆయనతో కలిసి మాట్లాడుతానని చెప్పారు. గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లో టీఆర్ఎస్ నుంచి తీగల కృష్ణారెడ్డి పోటీ చేయగా ఆయనపై కాంగ్రెస్‌ పార్టీ తరఫున సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం సబితా టీఆర్ఎస్ కండువా కప్పుకుని మంత్రి పదవి పొందారు. అప్పటి నుంచి వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని తెలిసింది.