schedule Saturday, July 04, 2026

బస్తీ దవఖానపై దౌర్జన్యం..!

calendar_today November 26, 2022
person dharshininews
బస్తీ దవఖానపై దౌర్జన్యం..!
బస్తీ దవఖానపై దౌర్జన్యం..! - చెట్లు, తాళాలు విరగొట్టిన పొరంబోకులు - రాత్రి వేళల్లో అసాంఘిక కార్యక్రమాల కోసం దుశ్చర్య - చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన బస్తీ దవఖాన్నపై కొందరు దౌర్జన్యానికి తెగబడ్డారు. దవఖాన పరిసరాల్లో ఉన్న చెట్లను విరగొట్టి.. తాళాలు పగలగొట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈసంఘటన తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు బస్తీ దవఖానలో శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని నెలల క్రితమే తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో అంబేద్కర్ పార్కులో బస్తీ దవఖానను అందుబాటులోకి తీసుకవచ్చారు. అంతకుముందు పార్కులో ప్రహారి గోడ, గేటు తాళాలు లేకపోవడంతో ఆకతాయిలకు అడ్డా మారింది. రాత్రియితే యువకులు మద్యం సేవించడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారు. ప్రస్తుతం బస్తీ దవఖాన అందుబాటులోకి రావడంతో పార్కులోకి ఆకతాయిలు చొరబడే అవకాశం లేకుండా పోయింది. అయినా సరే లోనికి ప్రవేశించేందుకు తంటాలు పడ్డారు. ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు రెండు, మూడు సార్లు జరిగాయని స్థానికులు వాపోతున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి పొరంబోకులు లోనికి ప్రవేశించి దవఖాన పరిసరాలలో ఉన్న చెట్లను విరగొట్టి.. తాళాలను పగులగొట్టారు. శనివారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వార్డు కౌన్సిలర్ బొంబీనా, స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవరావుల దృష్టికి తీసుకెళ్లారు. చైర్మన్ సంజీవరావు దవఖాన వద్దకు చేరుకుని పరిశీలించారు. దవఖానపై దౌర్జన్యానికి పాల్పడడం దుర్మార్గమన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా అధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. స్థానికులు సైతం ఇదే డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.