schedule Saturday, July 04, 2026

దళితబంధు లబ్దిదారులకు షాక్..!

calendar_today December 17, 2022
person dharshininews
దళితబంధు లబ్దిదారులకు షాక్..!
దళితబంధు లబ్దిదారులకు షాక్..! - ఆ కుటుంబాలకు ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు నిలిపివేత - దరఖాస్తు ప్రక్రియలో మార్పులు చేస్తున్న అధికారులు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం లబ్దిదారులకు సర్కారు షాక్ ఇవ్వబోతోంది. ఈ పథకం ద్వారా లబ్దిపొందిన కుటుంబాలకు ఎస్సీ కార్పోరేషన్‌ రుణాలను నిలిపివేయాలని యోచిస్తోంది. రాష్ట్రంలోని దళితులు దళితబంధుతో ఆర్థిక సాధికారత సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకం కింద లబ్ధిదారులైన ఒక్కో ఎస్సీ కుటుంబానికి రూ.10లక్షల విలువైన యూనిట్‌ను మంజూరు చేస్తోంది. ఇప్పటి వరకు రూ.3,300 కోట్లకు పైగా ఈ పథకం కింద వెచ్చించిన ప్రభుత్వం 38,476 యూనిట్లు మంజూరు చేసింది. ఇందులో 90 శాతం యూనిట్లకు అవసరమైన నిధులను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అందజేసింది. లబ్ధిదారుల ఎంపిక ప్రస్తుతం ఎమ్మెల్యేల సిఫారసు మేరకు జరుగుతోంది. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో... లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సిఫారసు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దళితబంధు కింద లబ్ధిపొందిన కుటుంబాలను ఎస్సీ కార్పొరేషన్‌ పరిధిలోని ఇతర పథకాల నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణాల వల్ల ఈ ఏడాదికి నియోజకవర్గాలవారీగా లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోయింది. సాధారణంగా ఎస్సీ కార్పొరేషన్‌ కింద రాయితీ రుణాలు, ఇతర ఆర్థిక పథకాల కింద ఒకసారి లబ్ధిపొందిన కుటుంబాలకు అయిదేళ్ల పాటు తదుపరి ఎంపికలో అవకాశమివ్వరు. అదే విధంగా దళితబంధు పథకం కింద ఒకసారి లబ్ధిపొందిన వారికి, ఇక ఎస్సీ కార్పొరేషన్‌ పరిధిలో అమలవుతున్న రాయితీ రుణాలు, ఇతర ఆర్థిక సహకార పథకాల కింద ఎంపిక చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో సాంకేతిక మార్పులు చేస్తోంది. లబ్ధిదారుడి ఆధార్‌, రేషన్‌కార్డు సహాయంతో సాఫ్ట్‌వేర్‌ ద్వారా వడపోత ప్రక్రియ పూర్తిచేయనుంది. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక, దరఖాస్తుల స్వీకరణపై ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయమై ఎస్సీ కార్పొరేషన్‌ సమాలోచనలు చేస్తోంది.