schedule Saturday, July 04, 2026

నేటి నుంచే గ్రూప్-4 దరఖాస్తులు

calendar_today December 23, 2022
person dharshininews
నేటి నుంచే గ్రూప్-4 దరఖాస్తులు
నేటి నుంచే గ్రూప్-4 దరఖాస్తులు - ఏయే శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే - జనవరి 12 వరకు తుది గడువు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ఉద్యోగాలకు సిద్దమవుతున్న రాష్ట్రంలో నిరుద్యోగులకు సర్కారు తీపి కబుర్లు అందిస్తూ వస్తుంది. తాజాగా గ్రూప్‌-4 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నేటి నుంచి అనగా శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించ నుంది. రాష్ట్రంలో 9,168 పోస్టులకు టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో జిల్లాల వారీగా పోస్టులతో కూడిన సమగ్ర ప్రకటనతో పాటు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నెల 23 నుంచి 2023 జనవరి 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కమిషన్‌ తెలిపింది. దరఖాస్తుల సమర్పణకు మూడు వారాల గడువు ఇచ్చింది. పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో ఏప్రిల్‌ లేదా మే నెలలో నిర్వహిస్తామని ఇప్పటికే వెల్లడించింది. గ్రూప్‌-4 ఉద్యోగాల్లో అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 1,862 వార్డు అధికారుల పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూశాఖ పరిధిలో 2,077 పోస్టులు ఉండగా.. వీటిలో సీసీఎల్‌ఏ పరిధిలో 1,294 ఉన్నాయి. సాధారణ, సంక్షేమ గురుకులాల్లో 991 పోస్టులున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6,859, జూనియర్‌ అకౌంటెంట్‌ 429, జూనియర్‌ ఆడిటర్‌ 18, వార్డు అధికారుల పోస్టులు 1,862 భర్తీ కానున్నాయి. మరోవైపు గ్రూప్‌-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని కమిషన్‌ అంచనా వేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన 9,168 పోస్టులకు గాను అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేసుకుంటారని భావిస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో కనీసం 6-7 లక్షల మధ్యలో రావొచ్చని భావిస్తోంది.