schedule Saturday, July 04, 2026

నేటి నుంచే గ్రూప్-4 దరఖాస్తులు

calendar_today December 30, 2022
person dharshininews
నేటి నుంచే గ్రూప్-4 దరఖాస్తులు
నేటి నుంచే గ్రూప్-4 దరఖాస్తులు - ఏయే శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే - జనవరి 19 వరకు తుది గడువు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలను భర్తి చేయడంలో భాగంగా ప్రకటించిన గ్రూప్‌-4 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులను నేటి నుంచి స్వీకరించనుంంది. రాష్ట్రంలో 9,168 పోస్టులకు టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో జిల్లాల వారీగా పోస్టులతో కూడిన సమగ్ర ప్రకటనతో పాటు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నిజానికి గ్రూప్‌ 4 దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్‌ 23 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల డిసెంబర్‌ 30వ తేదీ మార్చింది. దీంతో శుక్రవారం నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్‌ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో ఏప్రిల్‌ లేదా మే నెలలో నిర్వహిస్తామని ఇప్పటికే వెల్లడించింది. వచ్చేనెల 19వ తేది వరకు దరఖాస్తులకు గడువు ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు గ్రూప్‌-4 ఉద్యోగాల్లో అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 1,862 వార్డు అధికారుల పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూశాఖ పరిధిలో 2,077 పోస్టులు ఉండగా.. వీటిలో సీసీఎల్‌ఏ పరిధిలో 1,294 ఉన్నాయి. సాధారణ, సంక్షేమ గురుకులాల్లో 991 పోస్టులున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6,859, జూనియర్‌ అకౌంటెంట్‌ 429, జూనియర్‌ ఆడిటర్‌ 18, వార్డు అధికారుల పోస్టులు 1,862 భర్తీ కానున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన 9,168 పోస్టులకు గాను అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేసుకుంటారని కనీసం 6-7 లక్షల మధ్యలో రావొచ్చని అంచనా వేస్తున్నారు.