schedule Saturday, July 04, 2026

భుజంపై మృతదేహంతో పరుగు

calendar_today January 14, 2023
person dharshininews
భుజంపై మృతదేహంతో పరుగు
భుజంపై మృతదేహంతో పరుగు - పోస్టుమార్టం చేయొద్దని అభ్యంతరం - సంఘటన వెనుక ఏం జరిగిందంటే హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్దమవుతుండగా మృత దేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు తీశాడు ఓ వ్యక్తి. మృతదేహానికి పోస్టుమార్టం చేస్తారని అభ్యంతరం తెలుపుతూ ఈ చర్యకు పాల్పడ్డాడు. సంచలమైన ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన జడల మల్లయ్య (65) అనే వ్యక్తి గురువారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున భర్త మృతి చెందిన విషయాన్ని గమనించిన ఆయన భార్య చంద్రవ్వ విషయాన్ని కుటుంబ సభ్యులకు, బందువులకు తెలిపింది. కుటుంబసభ్యులు ఉదయం అంత్యక్రియలు చేస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం సిరిసిల్లకు తరలించాలని సూచించారు. అందుకు మల్లయ్య కుటుంబసభ్యులు నిరాకరించారు. ఇంతలో మల్లయ్య సోదరుడి కుమారుడు రాజు మృతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగెత్తాడు. మల్లయ్య గుండెపోటుతో మృతి చెందాడని, ఆయన మృతిపై తమకు ఎటువంటి అనుమానం లేదంటూ శ్మశానవాటిక వైపు పరుగులు తీశాడు. పోలీసులు ఆయన్ని వెంబడించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మల్లయ్య మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ సాంబశివరావు తెలిపారు.