schedule Saturday, July 04, 2026

సెల్‌ టవర్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు

calendar_today January 20, 2023
person dharshininews
సెల్‌ టవర్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు
సెల్‌ టవర్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు - రూ. 8.32 లక్షల విలువ - బీహార్‌లో వైరల్‌ అయిన వింత చోరి దర్శిని డెస్క్‌: దేశంలోని బీహార్‌ వింత దొంగతనాలు చర్చనీయాంశమవుతున్నాయి. గతంలో రైలింజిన్‌, ఇనుప వంతెనలను ఎత్తుకెళ్లిన ఘనులు తాజాగా సెల్‌ టవర్‌ను చోరీ చేశారు. ఈ సంఘటన బీహార్ రాష్ట్ర రాజధాని పట్నాలో జరగడం విశేషం. పట్నాలోని సబ్జీబాగ్‌ ప్రాంతంలో ఓ భవనంపై గుజరాత్‌ టెలీ లింక్‌ (జీటీఎల్‌) కంపెనీ ఓ సెల్‌ టవర్‌ను అమర్చింది. నాలుగు నెలల క్రితం కొందరు వ్యక్తులు ఆ ఇంటి యజమాని వద్దకు వెళ్లి.. జీటీఎల్‌ ఉద్యోగులమంటూ పరిచయం చేసుకున్నారు. టవర్‌కు మరమ్మతులు చేయాలని చెప్పి భవనంపైకి వెళ్లారు. 4 గంటలైనా వారు కిందకు రాకపోవడంతో ఇంటి యజమాని వెళ్లి చూశాడు. వారు టవర్‌ను విడిభాగాలుగా చేసి ఎత్తికెళ్లినట్లు గుర్తించాడు. వెంటనే జీటీఎల్‌ మేనేజర్‌కు సమాచారమిచ్చాడు. ఈ వ్యవహారంపై కంపెనీ నాలుగు నెలలపాటు అంతర్గతంగా విచారణ జరిపింది. అయినా ఆధారాలేవీ లభ్యం కాలేదు. చేసేదేమీ లేక తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోయిన సెల్‌ టవర్‌ విలువ రూ.8.32 లక్షలు ఉంటుందని సమాచారం. జీటీఎల్ కంపెనీకి చెందిన సెల్‌ టవర్‌లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 2022 నవంబరులోనూ జీటీఎల్‌ కంపెనీకి చెందిన రూ.19 లక్షల విలువైన సెల్‌ టవర్‌ ఒకటి చోరీకి గురవడం గమనార్హం.