తాండూరులో టెన్షన్.. టెన్షన్..!
February 3, 2023
dharshininews
తాండూరులో టెన్షన్.. టెన్షన్..!
- గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీ గౌడ్ అరెస్ట్
- శివ స్వాముల కేసుతో సంబంధంపై రిమాండ్
- మరో ఐదు మంది పరిగి జైలుకు తరలింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరులో టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. తాండూరులో సంచలనమైన శివ స్వాముల కేసులో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీగౌడ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇదేలో మరో ఐదుగురిని కూడ రిమాండ్ చేసి పరిగి జైలుకు తరలించారు. ఈ సంఘటన తాండూరులో ఉద్రిక్తరంగా మారింది. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే.. గత నెల జనవరి 30వ తేదీన యాలాల మండలం దేవనూర్ గ్రామంలో రాత్రి గ్రామానికి చెందిన బోయిని శ్రీనివాస్‌ను మైక్ విషయంలో దాడి చేశారు. దీనిని గమనించిన శివ మాల ధరించిన స్వామి నరేందర్ అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో నరేందర్‌కు అదే గ్రామానికి చెందిన మెట్ల నరేష్‌తో వాగ్వివాదం జరిగింది. దీంతో నరేష్ నరేందర్‌ను, శివ మాలను అవమానించే విధంగా వాఖ్యలు చేశారు. దీనిపై నరేందర్ మరుసటి రోజు ఉదయం యాలాల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా రోడ్డులో దాదాపు 100 మంది శివస్వాములు ఆందోళనకు దిగారు. శివ మాలను అవమాన పరిచిన నిందితుడును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో నిందితుడు నరేష్ యాలాల వెళ్లినట్లు తెలుసుకుని స్వాములు అక్కడికి చేరుకున్నారు. అక్కడ నరేష్ పోలీస్టేషన్‌లో ప్రాణరక్షణ కోసం లోపటికి వెళ్లినా శివ స్వాములు మూకుమ్ముడిగా దాడి చేశారు. అనంతరం తనపై దాడి చేసిన వారిపై నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే నరేష్ అందించిన ఫిర్యాదులోని నిందితులు బొక్కె నరేందర్, నరేందర్ గౌడ్, అరవింద్ గౌడ్, శివకుమార్, గణేష్‌లను పోలీసులు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ నివాసంలో అరెస్టు చేశారు. కేసు విచారణలో నిందితులు నరేష్‌పై దాడి ఘటనలో మురళీకృష్ణ గౌడ్‌కు సంబంధం ఉన్నట్లు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈమేరకు మురళీకృష్ణ గౌడ్‌ను కూడ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం వారిని కోర్టులో మురళీకృష్ణ గౌడ్‌ను హాజరు పరిచి రిమాండుకు తరలించారు. అదేవిధంగా కేసులో నిందితులు అయిన బొక్కె నరేందర్, నరేందర్ గౌడ్, అరవింద్ గౌడ్, శివకుమార్, గణేష్‌లను కూడ పరిగి జైలుకు తరలించారు.
కోర్టు మార్గంలో ఉద్రిక్తత
మరోవైపు మురళీకృష్ణ గౌడ్, శివ స్వాముల అరెస్టు, రిమాండ్ పట్ల ఉద్రిక్తత నెలకొంది. నిందితులను కోర్టుకు తరలించడంతో కోర్టు మార్గంలో శివ స్వాములు భారీగా తరలివచ్చారు. పోలీసులను కూడ భారీగా మొహరించారు. దీంతో కోర్టు మార్గం ఉద్రిక్తతంగా మారింది. నిందితుల కుటుంబ సభ్యులను, శివ స్వాములు భారీగా రావడంతో పోలీసులు వారితో చర్చించి అక్కడి నుంచి పంపించారు. కోర్టు మార్గంలో పోలీసుల వాహనాలు భారీగా రావడంతో అందరి దృష్టి కోర్టు మార్గంపై పడింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా రూరల్ సీఐ రాంబాబు, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, పరిగి సీఐ వెంకట్రామయ్యలు పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు: డీఎస్పీ శేఖర్ గౌడ్
ఈ కేసు విషయంలో తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. శివ స్వాముల కేసులో గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ ప్రమేయం ఉన్నందును ఆయనను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. నరేష్ పై దాడికి పాల్పడిన ఐదు మందిని కూడ రిమాండుకు తరలించడం జరిగిందన్నారు. ఎవరైనా విద్వేశాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తే.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.