schedule Saturday, July 04, 2026

బట్టల కొనుగోలులో కొట్లాట

calendar_today April 11, 2023
person dharshininews
బట్టల కొనుగోలులో కొట్లాట
బట్టల కొనుగోలులో కొట్లాట - ఘర్షణ పడిన ఇరువర్గాలు - కేసు నమోదు చేసిన పోలీసులు - తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి: బట్టల కొనుగోలు విషయంలో ఇరువర్గాల మద్య కొట్లాట జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం మిర్యాణ్‌కు చెందిన గోపాల్ తన స్నేహితుడు చోటుతో కలిసి తాండూరులో బట్టలు కొనుగోలు చేసేందుకు వచ్చాడు. పట్టణంలోని శాంత్ మహాల్ చౌరస్తా సమీపంలో ఓ బట్టల షాప్‌ వద్ద రూ. 1600లకు మూడు జతలు అనే ఆఫర్ చూసి షాపులోకి వెళ్లాడు. బట్టలను ప్యాక్ చేసే సమయంలో షాపు యజమాని మోహిద్ ఆఫర్‌ ధరకు ఇవ్వకపోవడంతో గోపాల్ ఇదేమిటి అని ప్రశ్నించాడు. ఇందుకు వ్యాపారి ఆ ఆఫర్‌ పాతది.. ఇప్పుడు ఆ ధరలకు ఇవ్వడం జరగదని దురుసుగా బదులిచ్చారు. అప్పుడే గోపాల్ వెంట వచ్చిన చోటు తన ఫోన్‌ పోయిందని బయటకు వెళ్లాడు. అ తరువాత కూడ మోహీద్, గోపాల్‌ ల మద్య వాగ్వివాదం జరిగింది. దీంతో గోపాల్ తాండూరు పట్టణం సాయిపూర్‌కు చెందిన రామకృష్ణకు ఫోన్ చేశాడు. దీంతో రామకృష్ణ రాజు అనే స్నేహితునితో కలిసి షాపు వద్దకు వచ్చారు. మళ్లీ అదేవిషంలో వారి మద్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో షాపు యజమాని మోహీద్, అక్కడే ఉన్న సలీం, సలాం అనే వ్యక్తులు గోపాల్, రామకృష్ణ, రాజులపై దాడి చేశారు. దీంతో ఇరువర్గాల ఘర్షణగా మారింది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. బాధితుడు గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాపు యజమాని మోహీద్, సలీం, సలాంపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.