schedule Saturday, July 04, 2026

కళ్యాణ లక్ష్మీ కాసుల్లో కక్కుర్తి..!

calendar_today April 20, 2023
person dharshininews
కళ్యాణ లక్ష్మీ కాసుల్లో కక్కుర్తి..!
కళ్యాణ లక్ష్మీ కాసుల్లో కక్కుర్తి..! - రూ. 15 వేలు లంచం డిమాండ్‌ - బషీరాబాద్‌ ఆర్ఐపై సస్పెండ్‌ వేటు - ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వ పథకాలను పేదలకు పకడ్బందీగా అందజేయాల్సిన ఉద్యోగి ఆమె. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మీ డబ్బుల మంజూరు కోసం రూ. 15 వేలు లంచం డిమాండ్ చేసి ప్రభుత్వ యంత్రాంగానికి మచ్చ తెచ్చారు. విషయం తెలిసిన వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సదరు ఉద్యోగిపై సస్పెండ్‌ వేటు వేశారు. వివరాల్లోకి వెళితే.. బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామానికి చెందిన పుర్మ మొగులమ్మకు భర్త లేడు. కూలీ పనులు చేసి కూతురు పెళ్లి చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకానికి దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం కూడా కళ్యాణలక్ష్మీ కింద నిధులు మంజూరు చేసింది. బషీరాబాద్ మండల కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ చెక్కులను పర్యవేక్షించే ఆర్ఐ భాగ్యలక్ష్మీని మొగులమ్మ చెక్కు గురించి అడిగితే రూ. 15 వేలు లంచం అడిగింది. దీంతో బాధితురాలు నేరుగా మండల తహసీల్దార్ వెంకటస్వామికి తెలిపింది. తహసీల్దార్ స్పందించి మొగులమ్మకు చెక్కు ఇప్పించారు. ఆర్ఐ భాగ్యలక్ష్మీ రూ. 15 వేలు లంచం అడిగినట్లు గురువారం వివిధ పత్రికల్లో కథనం వచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్పందించి ఆర్ఐ భాగ్యలక్ష్మీని సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్, బషీరాబాద్‌ తహసీల్దార్ వెంకటస్వామికి ఈ ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు బషీరాబాద్‌ ఆర్ఐ భాగ్యలక్ష్మీని అధికారులు సస్పెండ్ చేశారు.