schedule Wednesday, September 09, 2026

బీసీలపై చిత్తశుద్ది చాటుకోండి..!

calendar_today November 28, 2025
person dharshininews
బీసీలపై చిత్తశుద్ది చాటుకోండి..!
బీసీలపై చిత్తశుద్ది చాటుకోండి..! - ఎన్ని సర్పంచ్‌ స్థానాలు ఇస్తారో చెప్పాలి - తాండూరు ఎమ్మెల్యే బహిరంగా ప్రకటించాలి - బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా స్పందించాలి - బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : సర్పంచ్‌ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలపై ఉన్న చిత్త శుద్దిని చాటు కోవాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ కోరారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పినట్లు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగపరంగా అది అమలు కానప్పుడు పార్టీ పరంగా అయినా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న మాటకు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులకు ఎంతమందికి మద్దతు ఇస్తున్నారో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బీసీలు జనరల్ స్థానాల్లో పోటీ చేయాలని, తెలంగాణలో బీసీ వాదం బలంగా ఉన్నందున గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ శ్రేణులు విస్తృతంగా పోటీకి దిగాలని ఆయన సూచించారు. అవసరమైతే జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు పోటీ చేస్తే రాష్ట్ర బీసీ జేఏసీ నాయకుల ద్వారా ప్రచారంలో పాల్గొంటామని అన్నారు. ఈ విషయంపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బహిరంగ ప్రకటన చేయాలని అన్నారు. అదేవిధంగా బిఆర్ఎస్, బిజెపి వంటి ప్రధాన పార్టీలు కూడా జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39846/