schedule Thursday, September 03, 2026

పల్లెలపై డిజిటల్ నజర్..!

calendar_today August 28, 2026
person dharshininews
పల్లెలపై డిజిటల్ నజర్..!
పల్లెలపై డిజిటల్ నజర్..! - గ్రామాల సమగ్ర సమాచారం ఆన్ లైన్ లోనే - జనాభా, మౌలిక వసతుల వరకు వివరాల నమోదు - ప్రజలకు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాల వారీగా ప్రజలకు అవసరమైన సమాచారం సులభంగా లభించేలా డిజిటల్‌ రికార్డులను రూపొందిస్తోంది. ఇందులో గ్రామ జనాభా, కుటుంబాలు, నివాస గృహాలు, మౌలిక వసతులు తదితర వివరాలను నమోదు చేయనున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలోని జనాభా వివరాలతో పాటు పురుషులు, మహిళలు, పిల్లలు, ఎస్సీ, ఎస్టీ తదితర వర్గాల వారీ సమాచారాన్ని కూడా పొందుపరచనున్నారు. అలాగే గ్రామంలో ఉన్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వైద్య సదుపాయాలు, తాగునీటి వనరులు, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల వివరాలను డిజిటల్‌ రికార్డుల్లో నమోదు చేయనున్నారు. ప్రణాళికలకు మరింత ఉపయోగకరం గ్రామాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించే సమయంలో ఈ సమాచారం కీలకంగా మారనుంది. గ్రామంలో ఏయే సదుపాయాలు ఉన్నాయి.. ఇంకా ఏయే అవసరాలు ఉన్నాయి అనే వివరాలు అధికారులకు స్పష్టంగా అందుబాటులోకి రానున్నాయి. దీంతో అభివృద్ధి పనుల ప్రాధాన్యతను నిర్ణయించడంలో ఈ డిజిటల్‌ సమాచారం ఉపయోగపడనుంది. ఇప్పటివరకు గ్రామాల వివరాల కోసం వివిధ కార్యాలయాలను సంప్రదించాల్సిన పరిస్థితి ఉండగా.. ఆన్‌లైన్‌ విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు కూడా సమయం ఆదా కానుంది. అవసరమైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పరిశీలించడంతో పాటు డిజిటల్‌ రికార్డులను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. గ్రామ పంచాయతీల సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పారదర్శకత పెరగడంతో పాటు పాలన మరింత సులభతరం కానుంది. https://www.dharshininews.com/44410/