schedule Tuesday, November 03, 2026

పొలంలో విద్యుత్‌ విషాదం..!

calendar_today October 25, 2026
person dharshininews
పొలంలో విద్యుత్‌ విషాదం..!
పొలంలో విద్యుత్‌ విషాదం..! - ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మత్తుల్లో షాక్ - ప్రాణాలు కోల్పోయిన రైతు బిచ్చప్ప - గాయాలతో బయటపడిన అతని తమ్ముడు పెద్దేముల్‌, దర్శిని ప్రతినిధి: వ్యవసాయ పొలంలో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు సర్వీస్‌ వైరు సరిచేస్తుండగా జరిగిన విద్యుదాఘాతం ఓ రైతు ప్రాణాలను బలిగొంది. స్వల్ప గాయాలతో అతని తమ్ముడుకి ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన ఆదివారం పెద్దేముల్ మండలం గోపాల్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిసాన్‌పల్లి బిచ్చప్ప(38) పొలంలో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్‌ సరఫరా కల్పించేందుకు తమ్ముడు అశోక్‌తో కలిసి సర్వీస్‌ వైరు మరమ్మతులు చేస్తున్నాడు. ఈ క్రమంలో అశోక్‌ చెట్టుపై ఉండి కొమ్మలను తొలగిస్తుండగా, బిచ్చప్ప ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద వైరు సరిచేస్తున్నట్లు సమాచారం. ఈ సమయంలో 11 కేవీ విద్యుత్‌ లైన్‌కు జియో వైరు తగలడంతో బిచ్చప్పకు విద్యుదాఘాతం తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదాన్ని గమనించిన అశోక్‌ చెట్టుపై నుంచి కిందకు దిగే క్రమంలో గాయపడినట్లు తెలిసింది. ఈ ఘటనతో పొలంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. వ్యవసాయ పనుల కోసం వెళ్లిన అన్న తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. బిచ్చప్ప మృతితో గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. పొలం పనుల్లో అన్నదమ్ములిద్దరూ నిమగ్నమై ఉండగా చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో కుటుంబంలో విషాదం నెలకొంది. https://www.dharshininews.com/45180/