వంటింటి మంటకు ఊరట
May 25, 2022
dharshininews
వంటింటి మంటకు ఊరట
- తగ్గనున్న వంటనూనె ధరలు
- సామాన్యులకు ఉపశమనం
దర్శిని డెస్క్: వంటింటిలో సెగలు రేపిన నూనె ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో సామాన్యులకు కొంత ఊరట కలుగుతోంది. సన్ ఫ్లవర్, సోయాబీన్ నూనెల దిగుమతిపై భారత ప్రభుత్వం సుంకం, సెస్‌లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 2022-23, 20:23-21 ఆర్ధిక సంవత్సరాల్లో ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దుతిరుగుడు పువ్వు నూనెల దిగుమతికి ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ తాజా నోటిఫికేషన్లో పేర్కొంది. అంటే 2024 మార్చి 31 వరకు మొత్తం 80 లక్షల మెట్రిక్ టన్నుల నూనెల దిగుమతికి పన్ను భారం ఉండదు. ఇదిలా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35 లక్షల టన్నుల ముడి సోయాబీన్ నూనె, 16-18 లక్షల టన్నుల ముడి సన్ఫ్లవర్ నూనెలను దిగుమతి చేసుకోవచ్చని అంచనా వేశారు. ఇప్పటికే వంటనూనెలపై 5.5% కస్టమ్స్ సుంకంతో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్ వసూలు చేస్తున్నారు. తాజా ప్రకటనతో సోయాబీన్ నూనె ధర లీటరుకు రూ.3 తగ్గుతుందని సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా తెలిపారు. రైస్ బ్రాన్ ఆయిల్, కనోలా నూనెల పైనా దిగుమతి సుంకం రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే పామాయిల్ పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తొలగించింది. పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల రవాణా ఛార్జీల రూపేణ కొంత ఉపశమనం లభిస్తోంది.