schedule Saturday, July 04, 2026

అన్ని త‌ర‌గ‌తుల‌కు తెలుగు

calendar_today June 20, 2022
person dharshininews
అన్ని త‌ర‌గ‌తుల‌కు తెలుగు
అన్ని త‌ర‌గ‌తుల‌కు తెలుగు - ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ - ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అన్ని తరగతులకు తెలుగు సబ్జెక్టును తెలంగాణ ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర‌ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలతోపాటు సీబీఎస్సీ, ఐసీఎస్‌ఈ, ఐబీ వంటి ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల విద్యార్థులకు కూడా ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరి చేసిన‌ట్లు ఉత్త‌ర్వులులో స్ప‌ష్టం చేసింది. పదో తరగతిలో తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్ గా అమలుకు వీలుగా జీవో 15ను జారీ చేస్తూ, దీన్ని అమలు చేయాలని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. గ‌తంలో 1 నుంచి 9వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశపెడుతూ వచ్చారు. ఐతే ఈ ఏడాది 10వ తరగతిలోనూ తెలుగును తప్పనిసరి చేశారు. తెలుగు నిర్బంధ బోధనాభ్యాస చట్టం 2018లో భాగంగా ఈ విధానాన్ని దశల వారీగా అమలు చేయాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని స్కూళ్లలో 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించిన పాఠశాలలకు కఠినచర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించింది. దీనిలో భాగంగా విద్యాశాఖ రెండు రకాల పాఠ్యపుస్తకాలను ముద్రించింది. తెలుగు మాతృభాషగా కలిగిన విద్యార్ధులకు ఒకరకమైన టెక్స్ట్ బుక్‌లు, మాతృభాషకాని వారికోసం మరొక రకం టెక్స్ట్ బుక్కులను ముద్రించింది.