schedule Tuesday, September 08, 2026

శభాష్ రామకృష్ణ..!

calendar_today March 6, 2023
person dharshininews
శభాష్ రామకృష్ణ..!
శభాష్ రామకృష్ణ..! - గుండెపోటు ప్రాణాన్ని కాపాడినందుకు అభినందనలు - సన్మానించిన డీఎస్సీ శేఖర్ గౌడ్, సీఐ రాజేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్ రామకృష్ణ.. అంటూ తాండూరు పట్టణ పోలీసు శాఖ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణను తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిలు అభినందించారు. తాండూరు పట్టణం తులసీ నగర్‌లో నివాసముంటున్న నగేష్ అనే వ్యక్తికి ఆదివారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ అతనికి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రయత్నం ఫలించి నగేష్ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. వ్యక్తి ప్రాణాలను కాపాడడం పట్ల సోమవారం తాండూరు డీఎస్పీ జి. శేఖర్ గౌడ్ తన కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణను అభినందించారు. శాలువాతో సన్మానించి సత్కరించారు. అదేవిధంగా పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి కూడ తన కార్యాలయంలో రామకృష్ణను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ, సీఐలు మాట్లాడుతూ ఆగిపోతున్న గుండెకు రామకృష్ణ సీపీఆర్ చేసి ప్రాణం పోయడం అభినందనీయమన్నారు. సీపీఆర్ గురించి అందరు అవగాహన ఏర్పరుచుకోవాలని, ఆపద సమయాల్లో సీపీఆర్ ద్వారా ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయాలని సిబ్బందికి సూచించారు. మరోవైపు వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన రామకృష్ణకు రివార్డును కూడ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహిపాల్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.