schedule Sunday, July 05, 2026

మూడు వారాల్లో 'డబుల్‌' సిద్దం..!

calendar_today March 21, 2023
person dharshininews
మూడు వారాల్లో 'డబుల్‌' సిద్దం..!
మూడు వారాల్లో 'డబుల్‌' సిద్దం..! - వచ్చే వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ - పంపిణీకి ప్రక్రియను వేగవంతం చేయండి - పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక - ప్రజా ప్రతినిధుల సమన్వయంతో కసరత్తు - అధికారులతో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సమీక్ష వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: జిల్లాలోని పేదల సొంతింటికలను నిజం చేసేలా డబుల్‌ బెడ్‌రూంల పంపిణీకి అన్నిఏర్పాట్లు సిద్దం చేయాలని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ సి.నారాణరెడ్డి ఆదేశించారు. ప్రగతిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ పనులను వచ్చేమూడు వారాల్లో వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మంగళవారం డబుల్ బెడ్ రూమ్ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు, సంబంధిత మండలాల తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ధారూర్ మండలంలో -120, మర్పల్లిలో - 120, యాలాల మండలం కూకట్ లో 180, తాండూర్ పట్టణంలో 401, పరిగిలో - 180, కొడంగల్ - 48, చౌడపూర్ మండలంలోని అడవి వెంకటపూర్ లో - 30 ఇండ్లు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. చిన్న చిన్న పనులు తప్ప అన్ని హంగులతో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. మిగిలి ఉన్న నీటి సౌకర్యం, విద్యుత్తు పనులను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధుల సమన్వయంతో.. లబ్ధిదారుల ఎంపికలో భాగంగా స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి కొత్తగా దరఖాస్తులను స్వీకరించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు కసరత్తు ప్రారంభించాలన్నారు. గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించి సంబంధితలకు రసీదులు అందజేయాలని అన్నారు. డబల్ బెడ్ రూమ్ కొరకు లబ్ధిదారుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు సంబంధిత మండలాల లోని ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వచ్చేవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ స్థానిక శాసన సభ్యులు, ఆర్డీఓలతో సంప్రదించి వచ్చే సోమవారం నుండి వారం రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ, మరో వారం రోజులలో విచారణ గావించి తుది జాబితా రూపొందించుటకు అట్టి నివేదికలను ఆర్డీఓల ద్వారా జిల్లా అదనపు కలెక్టర్ కు పంపాలని సూచించారు. ఎంపికలో భాగంగా ముందుగా కచ్చా గృహాలలో (సాధారణ) ఉండే అతి పేదవారికి ప్రాధాన్యతను ఇచ్చి, మిగతా వారికి దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లయితే లాటరీ పద్ధతిలో ఎంపికను చేపట్టాలన్నారు. తహసీల్దార్లు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎలాంటి తప్పులు జరగకుండా పూర్తి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో ప్రజల నుండి దరఖాస్తుల సేకరణ కొరకు వేరు వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులను స్వీకరించాలన్నారు. ఇట్టి ప్రక్రియ మూడు వారాలలో పూర్తి చేయాలని అన్నారు.