schedule Sunday, July 05, 2026

మున్సిపల్ బడ్జెట్‌కు లైన్ క్లియర్

calendar_today March 31, 2023
person dharshininews
మున్సిపల్ బడ్జెట్‌కు లైన్ క్లియర్
మున్సిపల్ బడ్జెట్‌కు లైన్ క్లియర్ - 3న కార్యాలయంలో బడ్జెట్ సమావేశం - ఎమ్మెల్యే చొరవతో సిడిఎంఏ ఉత్తర్వులు జారీ - కార్మికుల వేతనాలు.. పీఆర్సీ బకాయిలకు మార్గం సుగమం - అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుకు తొలగిన ఇబ్బందులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మునిసిపాలిటీలో వార్షిక బడ్జెట్ కు సంబంధించి నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. గత ఏడాది కాలంగా వార్షిక బడ్జెట్ ఆమోదం లేకపోవడంతో తలెత్తిన ఇబ్బందులను తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకపోయారు. తాండూరు మునిసిపాలిటీ వార్షిక బడ్జెట్ కు సంబంధించి వెంటనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ రాష్ర్ట డైరెక్టర్(సిడిఎంఏ) సత్యనారాయణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మెమో నెంబర్ 4254/ఎంఏ(1)/2023 ద్వారా పురపాలక శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత ఆర్థిక ఏడాది(2022-2023) తో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-2024)కు సంబంధించిన వార్షిక బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మెమో మేరకు వెంటనే తాండూరు మునిసిపల్ వార్షిక బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని పేర్కొంటూ ఉత్తర్వులు 542234/2023 జారీ చేశారు. జిల్లా కలెక్టర్, తాండూరు మునిసిపల్ కమిషనర్ వెంటనే బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. డిసిఎంఏ ఆదేశాలతో ఏప్రిల్ 3న మునిసిపల్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చొరవతో గత ఏడాది బడ్జెట్ తో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆమోదంకు ఏప్రిల్ 3న ప్రత్యేక సమావేశంను నిర్వహిస్తున్నారు. వార్షిక బడ్జెట్ ఆమోదం తరువాత కార్మికుల వేతనాల చెల్లింపు, పీఆర్సీ బకాయిల చెల్లింపు, అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు, ట్రాక్టర్ల మరమ్మతులకు నిధులు, వీధి దీపాలకు నిధులు, చేతి పంపుల మరమ్మతులకు నిధులు అందుబాటులో ఉంటాయి.