schedule Saturday, July 04, 2026

విస్తృతంగా గులాబీ ఆవిర్భావం

calendar_today April 9, 2023
person dharshininews
విస్తృతంగా గులాబీ ఆవిర్భావం
విస్తృతంగా గులాబీ ఆవిర్భావం - ఈనెల 27న తెలంగాణ భవన్‌లో దినోత్సవం - 25న నియోజకవర్గ స్థాయి సమావేశాలు - ప్రకటించిన కార్యనిర్వహాఖ అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను విస్తృతంగా చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 27న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో భారాస ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. 27వ తేదీన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన జరగనున్న భారాస సర్వసభ్య సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి, చర్చించడం జరుగుతుందని తెలిపారు. అంతకుముందు ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశాలు పార్టీ నియమించిన ఇంఛార్జ్‌లు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన కొనసాగుతుందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో అన్నీ గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయమే పండగ వాతావరణంలో పార్టీ జెండాలు ఎగరవేయాలని, గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమం ముగించుకుని ఉదయం 10 గంటల కల్లా నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతినిధులు సభ సమావేశ స్థలికి చేరుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. సమావేశాలకు హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు అవసరమైన భోజనాలు, ఇతర వసతులు ఏర్పాటు చేయాలని, వేసవికాలం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లకు కేటీఆర్‌ సూచించారు. అదేవిధంగా అక్టోబరు 10వ తేదీన వరంగల్‌లో భారాస భారీ మహాసభ నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించిందని పేర్కొన్నారు.