schedule Tuesday, July 07, 2026

సనాతన సారథి..!

calendar_today July 13, 2024
person dharshininews
సనాతన సారథి..!
సనాతన సారథి..! - హిందూ ధర్మ రక్షణ కోసం సైకిల్‌ యాత్ర - సైకిల్‌పై తాండూరుకు చేరిన ఢిల్లీ యువకుడు - అప్పటి వరకు యాత్ర కొనసాగిస్తానని స్పష్టం తాండూరు, దర్శిని ప్రతినిధి : ధర్మం రక్షణ కోసం సారథిలా మారి సైకిల్‌ యాత్రకు బయల్దేరాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 50 వేల కిలోమీటర్ల సైకిల్‌ యాత్రకు శ్రీకారం చుట్టాడు. 26 ఏళ్లు ఉన్న యువకుడు చేపట్టిన యాత్ర వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చేరుకుంది. యువకుడు చేపట్టిన యాత్ర గురించి తెలిసి అందరు ఫిదా అవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చెందిన రాజేందర్‌ శర్మ ఢిల్లీలో స్థిరపడ్డారు. వస్త్ర దుకాణంలో పనిచేసే రాజేందర్ శర్మకు హిందూ ధర్మంపై ఆకర్షణ ఏర్పడింది. హిందూ ధర్మం రక్షణ కోసం సైకిల్‌పై సంపూర్ణ భారత్‌ యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న సైకిల్‌పై ఢిల్లీ నుంచి అయోధ్యకు బయలు దేరాడు. మార్చి 13న అయోధ్యలో సంపూర్ణ భారత్‌ యాత్ర మొదలు పెట్టాడు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను దాటుకుని తెలంగాణలోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా యువకుడు మాట్లాడుతూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి రోజు 70-80 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ ఇప్పటివరకు ఏడు రాష్ట్రాలు దాటి ఎనిమిది వేల కిలోమీటర్ల యాత్ర చేసినట్టు పేర్కొన్నాడు. సంపూర్ణ భారత్ యాత్రలో భాగంగా 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 51 శక్తి పీఠాలు, చార్ ధామ్, పంచ కేదార్ పర్యటించి స్వగ్రామం చేరతానని వివరించారు. 50వేల కిలో మీటర్ల ప్రయాణం తన లక్ష్యంగా పెట్టుకన్నట్లు తెలిపాడు. మార్గమధ్యలో సనాతన ధర్మంపై ప్రచారం చేస్తూ రాత్రివేళ దేవాలయాల వద్ద విశ్రాంతి తీసుకుంటానని వివరించాడు. యువకుడు చేస్తున్న సైకిల్ యాత్రకు అందరు ఫిదా అయ్యారు. యువకుడి ఆదర్శాన్ని అభినందించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27716/