schedule Saturday, July 04, 2026

అత్తారిల్లే.. నరకం..!

calendar_today December 18, 2025
person dharshininews
అత్తారిల్లే.. నరకం..!
అత్తారిల్లే.. నరకం..! - కుటుంబ కలహాలతో దాడి - వేధింపులకు కోడలు మృతి - ఆసుపత్రిలో వదిలేసి పరారైన భర్త - తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రేమించి పెళ్లిచేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టిన కోడలుకు ఆ ఇల్లే నరకం అయ్యింది. అత్తా, భర్త వేధింపులు, దాడులకు పాల్పడడంతో ఏడాది కాకముందే బలైపోయింది(మృతి చెందింది). ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు తాండూరు మండలం కరణ్‌ కోట్ గ్రామానికి చెందిన అనూష(22), తాండూరు పట్టణం సాయిపూర్‌ కు చెందిన పరమేష్‌లు ప్రేమించుకున్నారు. సుమారు 8నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పరమేష్‌ ట్రాక్టర్ పనులు, వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. కొన్ని రోజుల నుంచి అత్తారింట్లో అనూషకు కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భర్తతో కూడా విభేధాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం అనూషను భర్త కొట్టినట్లు సమాచారం. గురువారం పట్టణంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించగా అనూష మృతి చెందినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త పరమేష్‌ పరారి అయినట్లు సమాచారం. అనూష మృతి చెందినట్లు తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు తాండూరుకు చేరుకున్నారు. అనూష మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురికి తరలించారు. ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40088/