schedule Saturday, July 04, 2026

పోలీస్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు

calendar_today May 27, 2026
person dharshininews
పోలీస్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు
పోలీస్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు - నిందితుడి పరారి ఘటనపై యాక్షన్ - ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ - మరో ఇద్దరిపై చర్యలకు అవకాశం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణ పోలీస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఉత్తర్వులు జారీ చేసినట్లు తాండూరు పట్టణ సీఐ బొంగు పరమేశ్వర్ గౌడ్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఢీల్లి ప్రాంతానికి చెందిన అజీమ్ అనే యువకుడు ఆరు నెలల క్రితం తాండూరుకు వలస వచ్చాడు. పట్టణంలోని రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఓ కాలనీలో అద్దెకు ఉంటూ అదే ప్రాంతానికి చెందిన మైనర్‌ బాలకను ప్రేమ పేరుతో ట్రాప్‌ చేశాడు. ఈనెల 9న యువకుడు మైనర్‌ బాలికను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు యత్నించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో నిందితుడిపై కిడ్నాప్‌ కేసు నమోదైంది. నాలుగు రోజుల తరువాత నిందితుడు పోలీస్టేషన్‌ నుంచి పరారైనట్లు వదంతులు వ్యాపించాయి. ఎట్టకేలకు పోలీసులు మరోసారి నిందితున్ని అదుపులోకి తీసుకుని బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు మరో ఫిర్యాదుతో ఫోక్సో కేసు నమోదు చేశారు. కాగా నిందితుడు పోలీస్టేషన్‌ నుంచి పరారైనట్లు వచ్చిన ఘటనపై పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడిని కట్టుదిట్టం చేయడంలో విధుల్లో ఉన్న నరేందర్ అనే కానిస్టేబుల్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్లు పట్టణ సీఐ బొంగు పరమేశ్వర్ గౌడ్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనపై మరో ఇద్దరిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. https://www.dharshininews.com/43388/