schedule Tuesday, November 03, 2026

దసరా.. రగడ..!

calendar_today October 21, 2026
person dharshininews
దసరా.. రగడ..!
దసరా.. రగడ..! - సామూహిక వేడుకల్లో మళ్లీ లొల్లి - చీఫ్‌ విప్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల ముందే తోపులాట - నేతల రసా భసాపై పలువురి అసహనం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో జరిగిన దసరా వేడుకల్లో మళ్లీ రగడ రాజకీయం రాజుకుంది. ప్రతి యేడాది జరిగే ఉత్సవాల్లో ఏదో ఒక వివాదం జరుగుతోంది. ఈ సారి కూడా నిర్వహించిన వేడుకల్లో రాజకీయ అథిరథుల ముందే నాయకులు ఘర్షణ పడడం చర్చనీయాంశంగా మారింది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని పాత తాండూరు బోనమ్మ దేవాలయం వద్ద సామూహిక వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సారి కూడా ఏర్పాటు చేసిన వేడుకలకు చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, పలు పార్టీల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా ప్రారంభమైన కొద్ది సేపటికే రాజకీయ రభసకు వేదికైంది. గత కొన్ని నెలలుగా 10వ వార్డు కైన్సిలర్ శ్రీకాంత్ హిందూ ఉత్సవ సమితికి సంబంధించిన ప్లాట్ వివాదంను లేవనెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే సామూహిక వేడుకలలో కూడా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్లాట్ విషయాన్ని తేల్చాలని ప్రసంగిస్తుండగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లోళ్ల నర్సింలు, ఆ పార్టీ నేతలు అభ్యంతరం తెలుపడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చీఫ్‌ విప్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల ముందే నాయకులు తోపులాటలు చేసుకున్నారు. హిందూ ఉత్సవ సమితి సభ్యులు, పోలీసులు జోక్యం చేసుకుని ఘర్షణను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఓ వైపు మున్సిపల్ చైర్ పర్సన్ సైతం ఆందోళన కారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాలతో స్థానికులు, పలు సంఘాల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతి యేడాది దసరా వేడుకల్లో వివాదాలు, తగాదాలు పడడం ఏంటని పెదవి విరుపులు వ్యక్తం చేశారు. పోలీసులు తోపులాటను అదుపుచేయడం, హిందూ ఉత్సవ సమితి సభ్యులు నచ్చజెప్పే ప్రయత్నాలు చేయడంతో వివాదం సద్దుమణిగింది. Pvr https://www.dharshininews.com/45159/