schedule Wednesday, September 16, 2026

తాళం వేసిన ఇల్లు.. గుల్ల చేసిన దొంగలు..!

calendar_today September 16, 2026
person dharshininews
తాళం వేసిన ఇల్లు.. గుల్ల చేసిన దొంగలు..!
తాళం వేసిన ఇల్లు.. గుల్ల చేసిన దొంగలు..! - 10 తులాల బంగారం, రూ.3 లక్షలు అపహరణ - కూతురు ఫీజు డబ్బులను కూడా వదలని దుండగులు - తాండూరు అయ్యప్పనగర్‌లో పట్టపగలే భారీ చోరీ.. - విచారణ చేపట్టిన పోలీసులు తాండూరు, దర్శినిప్రతినిధి : ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు.. తిరిగి వచ్చేసరికి గుర్తుతెలియని దొంగలు ఇంటిని గుల్ల చేశారు. ఇంట్లో ఉన్న బంగారం, నగదుతో ఉడాయించారు. బుధవారం తాండూరు పట్టణం కోకట్‌ రోడ్డు మార్గంలోని అయ్యప్పనగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా గత కొన్ని రోజుల క్రితమే ఈ ప్రాంతంలో వరుస చోరీలు జరగడం పట్ల స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యప్ప నగర్‌లో అయ్యప్ప అనే వ్యక్తి భార్య, కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం అయ్యప్ప, ఆయన భార్య పనిమీద ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. కొద్ది సేపటి తరువాత భార్య ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి తాళం బద్దలు కొట్టి ఉండడంతో భర్తకు ఫోన్‌ చేసి విషయం తెలిపింది. ఆయన ఇంటికి వచ్చిన తరువాత లోపలికి వెళ్లి చూసే సరికి బీరువా తెరిచి ఉండడం కనిపించింది. బీరులో ఉన్న వారి కుమార్తె కాలేజీ ఫీజు చెల్లించేందుకు దాచుకున్న రూ.3 లక్షల నగదు, 10 తులాల బంగారం చోరికి గురికావడంతో సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మరోవైపు సమాచారం అందుకున్న వెంటనే రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్‌, యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటిని పరిశీలించి చోరీ జరిగిన తీరుపై వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ నెల 3, 14 తేదీల్లోనూ చోరీ ఘటనలు చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా అయ్యప్పనగర్‌లో పట్టపగలే చోరీ జరగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దొంగతనాలకు అడ్డుకట్ట వేసేలా పోలీసులు నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. https://www.dharshininews.com/44726/