schedule Thursday, November 12, 2026

బడులంటే ఇంత చిన్నచూపా..?

calendar_today November 12, 2026
person dharshininews
బడులంటే ఇంత చిన్నచూపా..?
బడులంటే ఇంత చిన్నచూపా..? - గదుల్లేక వరండాల్లో విద్యాభ్యాసం - ఒకే గదిలో మూడు తరగతులు - తాగునీరు, టాయిలెట్లు లేక విద్యార్థుల కష్టాలు - కమర్షియల్‌ కాంప్లెక్స్‌లపై ఉన్న శ్రద్ధ బడులపై లేదా - బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్‌ జావిద్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తరగతి గదులు లేక వరండాల్లోనే పాఠాలు వినాల్సిన దుస్థితి. ఒకే గదిలో రెండు, మూడు తరగతుల బోధన.. కూర్చోవడానికి బెంచీలు లేవు.. తాగడానికి మంచినీరు లేదు.. కనీస మరుగుదొడ్ల సదుపాయం కూడా సరిగా లేదు. పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే పేద పిల్లలు నాణ్యమైన విద్య ఎలా పొందాలి? అని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ జావిద్‌ ప్రశ్నించారు. గురువారం తాండూరు పట్టణంలోని 8వ వార్డు రాజీవ్‌, ఇందిరమ్మ కాలనీల్లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి పాఠశాలలో నెలకొన్న దుస్థితిని వివరించారు.సరిపడా తరగతి గదులు లేక కొన్ని తరగతుల విద్యార్థులు వరండాల్లోనే కూర్చొని చదువుకుంటున్నారని, ఒకే గదిలో వేర్వేరు తరగతులకు పాఠాలు చెప్పడంతో పిల్లలకు ఏకాగ్రత కుదరడం లేదని, ఉపాధ్యాయులు చెప్పేది సరిగా వినలేక చదువులో వెనుకబడే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలకు పంపే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ బడులను ఆశ్రయిస్తే అక్కడ కనీస వసతులు కూడా లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. పాఠశాలల అభివృద్ధిపై ఎమ్మెల్యే, అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి చూపుతున్న ఆసక్తి పేద పిల్లలు చదువుకునే బడులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు వంటి కనీస సౌకర్యాలను తక్షణమే కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలల దుస్థితిని మార్చకపోతే విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం కలిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. https://www.dharshininews.com/45355/