schedule Friday, November 13, 2026

సుస్మిత, సాక్షిల ఘనత గర్వకారణం

calendar_today November 13, 2026
person dharshininews
సుస్మిత, సాక్షిల ఘనత గర్వకారణం
సుస్మిత, సాక్షిల ఘనత గర్వకారణం - జాతీయ స్థాయితో పాటు ఆసియా క్రీడల్లోనూ రాణించాలి - బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి: గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు క్రీడారంగంలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. యాలాల పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన మూడవత్ సుస్మిత, రాథోడ్ సాక్షి సాధించిన విజయాన్ని ఆయన అభినందించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో హనుమకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-14 అథ్లెటిక్స్ పోటీల్లో డిస్కస్ త్రో విభాగంలో సుస్మిత ప్రథమ స్థానం, సాక్షి ద్వితీయ స్థానం సాధించారు. ఈ విజయంతో ఇద్దరూ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మారుమూల గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుపేద కుటుంబాల విద్యార్థినులు తమ పట్టుదల, కఠోర శ్రమతో ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో అభినందనీయమని రాజ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన యాలాల పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థినులు సుస్మిత, సాక్షిలను విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. సుస్మిత, సాక్షిలు జాతీయస్థాయి పోటీల్లోనూ విజయం సాధించి, భవిష్యత్తులో ఆసియా క్రీడల్లో పాల్గొని దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. వారి క్రీడా ప్రస్థానానికి జాతీయ బీసీ సంఘం అండగా ఉంటుందని, అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థినులను ఈ స్థాయికి తీసుకురావడంలో కృషి చేసిన పాఠశాల పీఈటీ రాజు, ప్రధానోపాధ్యాయులు గాజుల సిద్ధరామేశ్వర్‌లను కూడా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, బీసీ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, రవీంద్రనాథ్, అర్చన, నిర్మల, భారతి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45371/