వినాయక నిమజ్జనం సజావుగా జరగాలి
September 10, 2024
dharshininews
వినాయక నిమజ్జనం సజావుగా జరగాలి
- వేడుకలపై ప్రత్యేక నిఘా, బందోబస్తు
- వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
- కోకట్ కాగ్నా వాగు వద్ద ఏర్పాట్ల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : గణేష్ నిమజ్జన ఉత్సవాలు సజావుగా జరిగేలా చూడాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు. మంగళవారం తాండూరుకు వచ్చిన ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షించారు. యాలాల మండలం కోకట్ వాగు వద్ద చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఏయే శాఖల ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరా తీశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ వినాయక నిమజ్జన ఉత్సవాలను సవ్యంగా జరుపుకునేలా చూడాలన్నారు. నిమజ్జనంపై ప్రత్యేక బందోబస్తు, నిఘా ఉంచాలన్నారు. ఊరేగింపులో డీజే, సౌండ్ ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దన్నారు. నిమజ్జన వినాయకులను త్వరగా తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉత్సవ సమితి ప్రతినిధులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉత్సవాలను పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, పట్టణ సీఐ సంతోష్ కుమార్, రూరల్ సీఐ అశోక్ కుమార్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, పలువురు రాజకీయ, సంఘాల నాయకులు, తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/28918/