schedule Saturday, November 07, 2026

సీఎం సార్.. జర దేఖో..!

calendar_today November 7, 2026
person dharshininews
సీఎం సార్.. జర దేఖో..!
సీఎం సార్.. జర దేఖో..! - కొడంగల్‌కు కోట్లిచ్చినా - పక్క నియోజకవర్గాన్ని పట్టించుకోండి - తాండూరులో సమస్యల తాండవం - రోడ్లు, తాగునీరు, పంట నష్టాలతో ప్రజల సతమతం - బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎస్. వీరేందర్‌రెడ్డి డిమాండ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి: కొడంగల్‌ నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్న ప్రభుత్వం.. పక్కనే ఉన్న తాండూరు నియోజకవర్గంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని బీఆర్ఎస్ తాండూరు మండల అధ్యక్షుడు ఎస్. వీరేందర్‌రెడ్డి కోరారు. కొడంగల్‌కు సుమారు రూ.9,800 కోట్ల నిధులు మంజూరైనట్లు పేర్కొంటూ, తాండూరుకు కూడా కనీసం అందులో సగం నిధులైనా కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో తాండూరుకు కూడా సమయం కేటాయించి, ఇక్కడి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తాండూరు–పెద్దేముల్‌ రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆరు నెలల క్రితం నిర్మించిన తాండూరు–హైదరాబాద్‌ రహదారి సైతం దెబ్బతిన్నదని పేర్కొన్నారు. పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, గ్రామ పంచాయతీలకు తక్షణమే ఆర్థిక వనరులు సమకూర్చాలని కోరారు. మరోవైపు కంది, వరి, పత్తి పంటలు సాగు చేసిన రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారని, వారికి ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. తాండూరు ప్రజలు ఎదుర్కొంటున్న రహదారులు, తాగునీరు, వ్యవసాయ సమస్యలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చొరవ తీసుకుని ముఖ్యమంత్రిని తాండూరుకు తీసుకువచ్చి, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరయ్యేలా కృషి చేయాలని వీరేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. https://www.dharshininews.com/45291/