schedule Wednesday, July 08, 2026

అక్రమ ఇసుక రవాణాకు చెక్..!

calendar_today December 12, 2023
person dharshininews
అక్రమ ఇసుక రవాణాకు చెక్..!
అక్రమ ఇసుక రవాణాకు చెక్..! - ఇకనుంచి అనుమతులు తప్పనిసరి - మీసేవ, ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తులు - నిబంధనలు లేకుండా తరలిస్తే చర్యలు - పకడ్బందీగా వాల్టా చట్టం అమలు - అధికారుల సమీక్షలో ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాకు చెక్ పెట్టేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ శ్రీనివాస్ రావు ఆదేశించారు. మంగళవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎస్సైలతో వాల్టా చట్టం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాండూరులో వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అందరు సహకరించాలన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుదామన్నారు. ఎవరైనా ఇసుకను తరలించాలంటే మీ సేవా లేదా స్థానిక తహాసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మండలాల్లో, మున్సిపల్‌లో ఒక ట్రాక్టర్ ఇసుక తరలించేందుకు రూ. 600ల డీడీలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వే బిల్ పొందిన తరువాత ఇసుకను తరలించాలన్నారు. వే బిల్ లేకుండా తరలించే ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనాలను సీజ్ చేయాలన్నారు. దీంతో పాటు అక్రమ ఇసుక రవాణా జరిగే ప్రాంతాల వద్ద పోలీసులు గస్తీ ముమ్మరం చేయాలన్నారు. మరోవైపు మైన్స్ ఏడీ జాకబ్ మాట్లాడుతూ యాలాల బెన్నుర్, ఖాంజాపూర్ గ్రామాల్లో ఇసుక పాయింట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇసుక అనుమతులు పరిశీలించేందుకు గతంలో ఏర్పాటు చేసిన సిబ్బంది వ్యవస్థను మళ్లీ ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, సీఐ రాంబాబు, జెడ్పీటీసీలు ధారాసింగ్, శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22657/