అస్వస్థతతో ఆసుపత్రిపాలు..!
October 13, 2022
dharshininews
అస్వస్థతతో ఆసుపత్రిపాలు..!
- కలుషిత నీరు కారణం కాకపోవచ్చు
- వైద్యుల ప్రాథమిక విశ్లేషన
- జుంటుపల్లిలో వైద్యాధికారుల అప్రమత్తం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లిలో అస్వస్థత కారణంగా పలువురు ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన తాండూరు ప్రాంతంలో కలకలం రేపింది. జుంటుపల్లి గ్రామంలో మూడు కుటుంబాలకు చెందిన దాదాపు 14 మంది గురువారం తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వీళ్లంతా వాంతులు, విరోచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి బాధితులను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి వైద్యులు ప్రత్యేక శ్రద్ద వహించి వారికి మెరుగైన చికిత్స అందించారు. అయితే కలుషిత నీటి కారణంగా 14 మంది ఆస్వస్థతకు గురయ్యారని ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో కూడ వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన జిల్లా వైద్యాధికారి ఆదేశాలతో మండల వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని ఆరా తీశారు. బాధితుల ఇళ్లతో పాటు గ్రామస్తుల ఇంటింటికి వెళ్లి వివరాలను ఆరా తీశారు.
నీటి కలుషితం లేదు
అయితే విచారణలో నీటి కలుషితం జరగలేదని వైద్యులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. బాధిత కుటుంబ సభ్యులలో కొందరు పత్తి చేనుకు మందు పిచికారి చేసేందుకు వెళ్లారని, అక్కడే నీటిలో మందు కలిసి ఉండొచ్చని.. ఈ కారణంగానే వారు అస్వస్థతకు గురైనట్లు అనుమానాలను వ్యక్తం చేశారు. అదేవిధంగా బాధితుల నుంచి నమూనాలను సేకరించడం జరిగిందని, త్వరలోనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.