ఆసరా ఫించన్‌కు దరఖాస్తు చేసుకోండి
October 10, 2021
dharshininews
ఆసరా ఫించన్‌కు దరఖాస్తు చేసుకోండి
- పెద్దేముల్ ఎంపీడీఓ లక్ష్మప్ప ముదిరాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 57 ఏండ్లకే అందిస్తున్న ఆసరా ఫించన్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల ఎంపీడీఓ లక్ష్మప్ప ముదిరాజ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో 57 ఏండ్లకే అందించే ఆసరా ఫించన్ పథకానికి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని గుర్తుచేశారు. అప్పట్లో లబ్దిదారులు మిగిలిపోవడంతో తాజాగా ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించిందని వెల్లడించారు. ఈనెల 11వ తేది నుంచి 30వ తేదిలోపు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి 57 ఏళ్లు నిండినవారు ఆసరాకు అర్హులని, దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించి ఉండరాదన్నారు. కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2లక్షలు మించరాదని, ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాలు ఉంటే అనర్హులన్నారు. డాక్టర్లు, కాంట్రాక్టర్లు, అధిక ఆదాయం కలిగిన ఇతర వృత్తులు, వ్యాపారాల్లో కొనసాగుతున్న వారికి ఫించన్ రాదన్నారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు ఆసరా పెన్షన్లు ఇవ్వరని వెల్లడించారు. 57 ఏళ్లు నిండి, ప్రభుత్వం సూచించిన అన్ని అర్హతలు కలిగిన వారికే పెన్షన్ ఇస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.