అభయహస్తం ఔట్..!
April 17, 2022
dharshininews
అభయహస్తం ఔట్..!
- రేపటి నుంచి లబ్దిదారులకు కట్టిన సొమ్ము వెనక్కి
- జిల్లాలో 51,297 మందికి ఊరట
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశ పెట్టిన అభయహస్తం పథకం తెలంగాణ రాష్ట్రంలో తొలగించేందుకు సర్కారు నిర్ణయించింది. నేడో, రేపో దీనిపై ప్రకటన వెలువడనుంది. ఆరవై ఏళ్లు దాటిన తరువాత ప్రతినెలా ఫించన్ అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెఎస్ ప్రభుత్వం 2009లో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఈ పథకాన్ని నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకు అసరా పథకాన్ని ప్రవేశ పెట్టడంతో అభయహస్తాన్ని ఆపేశారు. 2014 కంటే ముందు వికారాబాద్ జిల్లా నుంచి 51వేల 297 మంది లబ్దిదారులు యేటా డబ్బులు చెల్లించారు. తెలంగాణ వచ్చాకా అభయహస్తం ఆగిపోవడంతో డబ్బులు చెల్లించిన లబ్దిదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో లబ్దిదారులు చెల్లించిన ప్రతి రూపాయికి వడ్డీతో సహా తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. రేపటి నుంచే పాలసీ కట్టిన లబ్దిదారుల ఖాతాలో నేరుగా జమచేసేందుకు నిర్ణయించింది. దీంతో జిల్లాలోని 51,297 మందికి ఊరట లభించనుంది. పాలసీదారులు మరణిస్తే వారి వారసులకు అందించాలని నిర్ణయించారు. అభయహస్తం కింద రాష్ట్ర వ్యాప్తంగా 21.67 లక్షల వరకు ఉండగా సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలో అమలు చేస్తున్నారు.