schedule Friday, July 10, 2026

30రోజుల్లో సమస్యలు తీర్చకపోతే కలెక్టరేట్ ముట్టడి

calendar_today June 29, 2022
person dharshininews
30రోజుల్లో సమస్యలు తీర్చకపోతే కలెక్టరేట్ ముట్టడి
30రోజుల్లో సమస్యలు తీర్చకపోతే కలెక్టరేట్ ముట్టడి - బీసీ సంఘం తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ - తాండూరులో బీసీల మహాదర్నా జయప్రదం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని బీసీల డిమాండ్లను పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం తాండూరు పట్టణం విజయ విద్యాలయ పాఠశాల సమీపంలోని ఐలమ్మ విగ్రహం వద్ద బీసీ మహాదర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కన్వినర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో దాదాపు 40పైకి పైగా బీసీల సమస్యలు ఉన్నాయన్నారు. అందులో ప్రధానంగా బీసీ సమీకృత భవనంకు భూమి కేటాయించాలని, పట్టణ నడిబొడ్డున ఉన్న బీసీ స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని, గౌ చెరువులోని గుర్రపుడెక్కను తొలగించి.. తూముకు మరమ్మత్తులు చేయాలని, బీసీ విద్యార్థుల వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని, కుల వృత్తుల వారికి ఆధునిక పనిముట్లు - రాయితీ కల్పించాలని డిమాండ్లను ప్రభుత్వం దృష్టికవస్తున్నట్లు వెల్లడించారు. బీసీ సమీకృత భవనంపై ఎమ్మెల్యేకు గతంలో విన్నవించడం జరిగిందని, స్మశాన వాటికకు నిధులు మంజూరైన ముందడుగు పడడంలేదని, గొల్లచెరువు సమస్యపై అధికారులు, ప్రజా ప్రతినిధులు, శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రధాన డిమాండ్లను 30 రోజుల్లో పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడుతామని పేర్కొన్నారు. అనంతరం ధర్నా స్థలం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరారు. అక్కడ ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. మరోవైపు ఈ ధర్నాకు కుల సంఘాలు, రాజకీయ నేతలు మద్దతు తెలపడంతో జయప్రదం అయ్యింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళ అధ్యక్షురాలు జ్యోతి, రజక సంఘం జిల్లా నాయకులు కృష్ణ, వడ్డెర సంఘం నాయకులు శ్రీనివాస్, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పరమేష్, హన్మంతు, తట్టెపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంజి, మత్య్సకార సంఘం నాయకులు నరహరి, రాజు, గోపాల్, యూత్ కాంగ్రెస్ నాయకులు బంటు వేణుగోపాల్, బీసీ యువజన సంఘం నాయకులు టైలర్ రమేష్, అశోక్, మతిన్, జుంటుపల్లి వెంకట్, తాండ్ర నరేష్, జగదీష్, శ్రీకాంత్, మహిళ నాయకులు అనిత, విజయలక్ష్మి, మంజుల తదితరులు పాల్గొన్నారు.